Whatsapp Governance: రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు... చంద్రబాబు సమీక్ష

AP Govt introduces Whatsapp Governance from tomorrow
  • రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించనున్న మంత్రి లోకేశ్ 
  • మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి వివిధ రకాల సేవలు
  • గతేడాది మెటాతో ఒప్పందం
వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. రేపు (జనవరి 30) వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మొదటి విడతగా పౌరులకు 161 రకాల సేవలను ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. 

రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 రకాల సేవలను ప్రవేశపెట్టనుంది. 

దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి అన్నారు. అదే విధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. 

వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. 


Whatsapp Governance
Chandrababu
AP Govt
Nara Lokesh
TDP-JanaSena-BJP Alliance

More Telugu News