BRS: జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం... బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్

BRS corporators arrested for protests during GHMC meeting
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట
  • మేయర్ సమక్షంలోనే పరస్పరం తోసుకున్న కార్పొరేటర్లు
  • జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన
  • బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈరోజు బడ్జెట్ ఆమోదం అనంతరం ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టడంతో సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి సమక్షంలోనే కార్పొరేటర్లు పరస్పరం తోసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్ళారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న తమ కార్పొరేటర్లను తిరిగి సభకు తీసుకువచ్చాకే సభను కొనసాగించాలని నినాదాలు చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ సభ్యులు మేయర్ పైకి పేపర్లు విసిరారని, అందుకు వారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

ప్రశ్నోత్తరాల అనంతరం ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించగా, వారు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
BRS
GHMC
Hyderabad
Congress

More Telugu News