RS Praveen Kumar: అల్లు అర్జున్‌కు ఓ న్యాయం... కిషన్ రెడ్డికి మరో న్యాయమా?: రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న

RS Praveen Kumar questions Revanth Reddy
  • సంధ్య థియేటర్ ఘటనపై ఒకలా, సాగర్ ఘటనపై మరోలా ఎందుకు స్పందిస్తున్నారని నిలదీత
  • బీజేపీతో, కిషన్ రెడ్డితో మీకున్న అనుబంధమేమిటని ప్రశ్న
  • అల్లు అర్జున్‌ని జైలుకు పంపిన ప్రభుత్వం కిషన్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్న
సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఓ న్యాయం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మరో న్యాయమా? అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనకు ఒకలా, హుస్సేన్ సాగర్ ఘటనకు మరోలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు.

హుస్సేన్ సాగర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గణపతి, అజయ్ ప్రాణాలు, సంధ్య థియేటర్ ఘటనలోని రేవతి ప్రాణాల విలువ ఒక్కటి కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి గారూ, మీకు, బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మధ్య అనుబంధం ఏమిటి? అని ప్రశ్నించారు.

సంధ్య థియేటర్ కేసులో మహిళ చనిపోతే అల్లు అర్జున్‌ని (ఏ-11)గా జైలుకు పంపించారని గుర్తు చేశారు. మరి భారతమాత మహా హారతి ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. భారతమాత మహా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి హుస్సేన్ సాగర్ ఘటనకు బాధ్యులు కారా? అని నిలదీశారు.

కిషన్ రెడ్డి గారి స్ఫూర్తితో నడుస్తున్న 'భారతమాత ఫౌండేషన్' ఈ కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ తీసుకుందా? తీసుకుంటే ఒక చెరువు మధ్యలో టపాకాయలు కాలుస్తామని చెప్పిందా? ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.

హుస్సేన్ సాగర్‌లోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాంబులు పేల్చడానికి అనుమతి ఇచ్చిందెవరు? ఆ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనికి టూరిజం అధికారుల అనుమతి ఉందా? అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ ఘోర ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారు? హోంమంత్రి మీరే కదా? అగ్నిమాపక శాఖ కూడా మీ వద్దే ఉంది కదా? అని సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
RS Praveen Kumar
G. Kishan Reddy
Allu Arjun
Pushpa

More Telugu News