Mohammed Shami: ఐదో టీ20లో ష‌మీ... బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఏమ‌న్నాడంటే...!

Will Mohammed Shami play 5th T20I in Mumbai Bowling coach Morne Morkel drops a hint
  • ఐదో టీ20లో షమీని ఆడిస్తామ‌న్న‌ మోర్నీ మోర్కెల్
  • నెట్స్‌లో సీమర్ ప్రదర్శన పట్ల తాను సంతోషంగా ఉన్నానని వ్యాఖ్య‌
  • అతని అనుభ‌వం యువ ఆట‌గాళ్ల‌కు ప్రోత్సాహకంగా ఉంటుంద‌న్న బౌలింగ్ కోచ్‌
టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ ఫిట్‌నెస్ గురించి ఆందోళ‌న నెల‌కొన్న స‌మ‌యంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టీ20లో అతనిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంద‌ని హింట్ ఇచ్చాడు.

2023లో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో గాయ‌ప‌డ్డ స్పీడ్‌స్టర్ ఏడాదికి పైగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌ కు షమీని ఎంపిక చేయడం జ‌రిగింది. దీంతో అభిమానులు సంబ‌రప‌డిపోయారు. స్టార్ పేస‌ర్ తిరిగి జ‌ట్టులోకి చేర‌డంతో రాబోయే టోర్నీల‌లో టీమిండియాకు తిరుగుండ‌ద‌ని ఆనందప‌డ్డారు. 

అయితే, ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమితం కావ‌డంతో అతను ఇంకా 100 శాతం ఫిట్‌గా ఉండకపోవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. కానీ, వాటిని పటా పంచ‌లు చేస్తూ షమీ రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఆడాడు. విశ్రాంతి తీసుకున్న అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో బ‌రిలోకి దిగాడు. 

ఈ మ్యాచ్‌లో మూడు ఓవ‌ర్లు వేసిన అత‌డు 25 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లేదు. ఈ మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ త‌ర్వాత పూణేలో జరిగిన నాలుగో టీ20లో షమీ స్థానంలో మ‌ళ్లీ అర్ష్‌దీప్ సింగ్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. దాంతో షమీ మళ్లీ బెంచ్‌కే ప‌రిమిత‌మ్యాడు. 

ఐదో టీ20లో షమీని ఆడిస్తాం: మోర్కెల్
తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్‌ మోర్కెల్... షమీ గురించి మాట్లాడుతూ, నెట్స్‌లో సీమర్ ప్రదర్శన పట్ల తాను సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ముంబ‌యిలో ఆదివారం జరగనున్న ఐదో టీ20లో షమీ ఆడించ‌నున్న‌ట్లు మోర్కెల్ తెలిపాడు.

"షమీ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వార్మప్ మ్యాచ్‌ల‌లో శ‌ర‌వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను తిరిగి జ‌ట్టులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వ‌చ్చే మ్యాచ్‌కి ష‌మీని ఆడిస్తాం. అతని అనుభ‌వం యువ ఆట‌గాళ్ల‌కు ప్రోత్సాహకంగా ఉంటుంది. భార‌త బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించే స‌త్తా ఉన్న బౌల‌ర్ ష‌మీ" అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
Mohammed Shami
Morne Morkel
Team India
Cricket
Sports News

More Telugu News