Tanuku SI: ఆత్మహత్యకు ముందు సహోద్యోగితో తణుకు ఎస్ఐ ఫోన్ సంభాషణ

Tanuku SI Murthi Phone Conversation with his Friend before suicide
  • తన జీవితాన్ని వారిద్దరే నాశనం చేశారని ఆరోపణ
  • తీవ్ర నిర్ణయం వద్దంటూ నచ్చజెప్పిన సహచరుడు
  • భార్యాపిల్లలను ఒంటరి వాళ్లను చేయొద్దంటూ మందలింపు
తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కే చెందిన సదరు సన్నిహితుడితో తన సమస్యను చెప్పుకుని కంటతడి పెట్టారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం బయటపడింది. ఇందులో తోటి ఉద్యోగులు ఇద్దరిపై మూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తన జీవితాన్ని నాశనం చేశారని, తనకు సంబంధం లేని విషయంలో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. విజ్జి (తన భార్య), పిల్లలను తలుచుకుంటే బాధేస్తోందంటూ మూర్తి కన్నీరుపెట్టారు.
 
ఎలా ఉన్నావంటూ అడిగిన సహచరుడికి రేంజ్ కి రిపోర్టు చేయమని ఆర్డర్ వచ్చిందంటూ మూర్తి చెప్పారు. మళ్లీ ఈ రేంజ్ గొడవేంటని అడగగా.. తనకూ తెలియదని, అక్కడికి వెళ్లలేనని మూర్తి చెప్పారు. రేంజ్ కి రిపోర్ట్ చేయడం తన వల్ల కాదన్నారు. తన మనసు బాగాలేదని, జీవితంపై ఆసక్తి లేదని చెప్పారు. ‘నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దర్ని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ వారు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. సంతోషంగా ఉన్న నా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు. వారు చేసిన మోసానికి నేను కుమిలిపోతుంటే వారు మాత్రం సంతోషంగా ఉన్నారు. వీఆర్ భీమవరంలోనే కదా అని ఇన్నాళ్లూ ఓపిక పట్టాను కానీ ఇక నా వల్ల కాదు. అక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. కృష్ణా జిల్లాకు పంపిస్తారు. ఒక రోజు కూడా నేను అక్కడ ఉండలేను. విజయ, పిల్లలను తలుచుకుంటేనే బాధేస్తోంది’ అని మూర్తి చెప్పారు.

మూర్తి మాటలు విన్న సహచరుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దంటూ మందలించాడు. పాజిటివ్ గా ఆలోచించాలని, వీఆర్ లో ఎంతోమంది ఉన్నారని, కృష్ణా జిల్లా అయితే ఏమవుతుందని అన్నాడు. కంగారుపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికాడు. ‘నీకు అన్యాయం జరిగింది నిజమే, కానీ చావు దానికి పరిష్కారం కాదు. అది ప్రాణం తీసుకునేంత పెద్ద సమస్య కాదు. నువ్వు లేకుంటే నీ భార్యాపిల్లలను ఎవరు చూస్తారు? ఆ అమ్మాయి (మూర్తి భార్య) కి ముందువెనుక, పుట్టింటికెళ్లి ఏడవడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు చూసుకోవడం వేరు, మీ అన్నయ్య చూడడం వేరు. నీ కుటుంబాన్ని ఎవరూ ఆదుకోరు. నువ్వు చనిపోతే ఆ ఇద్దరూ పశ్చాత్తాపంతో ఉద్యోగం వదులుకోరు. ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది. పశ్చిమగోదావరిలో నీకు అన్యాయం జరిగింది. జిల్లా మారితే మార్పు వస్తుందేమో ఆలోచించు. సరెండర్ చేశారు సరే వెళ్లి అడుగు. లా అండ్‌ ఆర్డర్‌ వదిలేయ్‌. లూప్‌ కావాలని అడుగు. అవసరమైతే నేనూ వస్తా. ఈ రోజు రేపు ఐజీ ఉండరు. తర్వాత వెళ్లి మాట్లాడదాం. నా మాట వినకపోతే ఎలా? నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా?.. నిన్ను నమ్ముకున్న వారి కోసం ఆలోచించు’ అని మూర్తి సహచరుడు చెప్పారు. అయితే, నేను వెళ్లలేను, నా వల్ల కావడం లేదంటూ మూర్తి కంటతడి పెట్టారు.
Tanuku SI
Last Phone call
SI Suicide
SI Audio
Andhra Pradesh

More Telugu News