Allu Arjun: అల్లు అర్జున్‌ 'తండేల్‌' ఈవెంట్‌కు రాకపోవడానికి ఇవే అసలు కారణాలు!

These are the real reasons why Allu Arjun did not come to the Thandel event
  • 'తండేల్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరుకాని అల్లు అర్జున్‌ 
  • పోలీసుల నుండి అనుమతి లభించకపోవడమే ప్రధాన కారణం 
  • చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న అల్లు అర్జున్

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వైజాగ్, చెన్నై, ముంబైలలో పలు ఈవెంట్లను చిత్ర బృందం నిర్వహించింది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో 'తండేల్ జాతర' పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ముందుగా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ, చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరు కాలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటన తర్వాత ఆయనపై కేసు నమోదు కావడం, అరెస్టు, ఆపై బెయిల్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ కారణంగానే బన్నీ కొంతకాలం పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే, 'తండేల్' చిత్రానికి సరైన బజ్ లేదని భావించిన నిర్మాత బన్నీ వాస్, తన స్నేహితుడైన అల్లు అర్జున్‌ను ఈ వేడుకకు రావాలని ఒప్పించాడు. ఇందుకోసం ముందుగా ప్రకటించిన తేదీని కూడా మార్చారు. అంతేకాకుండా, ఈ వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, ఇండోర్ ఫ్లోర్‌లో అతికొద్ది మందితో, మీడియా, చిత్ర యూనిట్‌తో వేడుక జరుపుకుంటామని అనుమతి కోరారు. దీనికి పోలీసు శాఖ అంగీకరించింది. కానీ, అల్లు అర్జున్‌ను మాత్రం వేడుకకు హాజరు కావద్దని సూచించినట్లు సమాచారం.

అదే సమయంలో, ప్రీ రిలీజ్ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని మీడియాలో ప్రకటించడంతో, అభిమానులు పెద్ద సంఖ్యలో ఫంక్షన్ జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. వేడుక జరిగే చోట పోలీసులు కూడా లేరు. సరిగ్గా ఇదే రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ కారణాలన్నింటి వల్ల అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది. 
Allu Arjun
Thandel
Thandel jathara
Naga Chaitanya
Sai Pallavi
Pushpa
Pushpa2
Allu arjun latest news
Tollywood

More Telugu News