USA: అమెరికాలో కొనసాగుతున్న బహిష్కరణ ఆపరేషన్.. వలసదారులతో భారత్ బయలుదేరిన విమానం

Flight that carries Indian migrants will land in India soon
  • మరికొన్ని గంటల్లో విమానం భారత్ చేరుకునే అవకాశం
  • విమానంలో ఎంతమంది ఉన్నారన్న విషయంలో అస్పష్టత
  • అమెరికాలో అక్రమంగా 7.25 లక్షల మంది భారతీయులు
  • అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తామన్న భారత్
భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం అమెరికా నుంచి బయలుదేరింది. మరికొన్ని గంటల్లో ఇది భారత్ చేరుకునే అవకాశం ఉంది. అయితే, ఇందులో ఎంతమంది ఉన్నారన్న వివరాలు తెలియరాలేదు. అన్నట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వివిధ దేశాలకు చెందిన వారిని బహిష్కరిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తిస్తున్న అధికారులు వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అందులో భాగంగా భారత్‌కు ఓ విమానం బయలుదేరింది. సీ17 విమానంలో వీరిని తరలిస్తున్నట్టు సమాచారం.

ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలుత 538 మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించారు. అలాగే, ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉంటున్న దాదాపు 5 వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు ఒక్కో వ్యక్తిపై అమెరికా దాదాపు 4,675 డాలర్లు ఖర్చు చేస్తోంది.

కాగా, అమెరికాలో భారత్‌కు చెందిన దాదాపు 7.25 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్‌కు తరలించేందుకు జాబితా రూపొందించింది. ఈ విషయంలో భారత్ కూడా తమ స్పందనను తెలియజేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా అమెరికా సహా ఎక్కడ ఉన్నా భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపింది. కాగా, మెక్సికో, సాల్వెడార్ తర్వాత అమెరికాలో ఎక్కువగా ఉంటున్నది భారతీయులే.
USA
Illegal Migrants
Indian Migrants

More Telugu News