Danam Nagender: హైడ్రా, అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. నాపై ఎన్నో కేసులు ఉన్నాయి: దానం నాగేందర్

Danam Nagendar says will not accept demolition of poor houses
  • పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదన్న దానం నాగేందర్
  • వైఎస్ హయాంలోనే అధికారుల విషయంలో కాంప్రమైజ్ కాలేదన్న ఎమ్మెల్యే
  • ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నాయన్న దానం నాగేందర్
  • నా ఇంట్లో వైఎస్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని వెల్లడి
  • పార్టీ మార్పుకు సంబంధించి తనకు నోటీసులు అందలేదన్న ఎమ్మెల్యే
నగరంలోని పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు. హైడ్రా అధికారుల విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తాను అధికారుల విషయంలో రాజీ పడలేదని అన్నారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్తానని, ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైడ్రా ఆపరేషన్ విషయంలో దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, తన ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని, వారి ఫొటోలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. నాయకుల విషయంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ఫొటో ఉండటంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన అన్నారు. నోటీసులు వచ్చాక స్పందిస్తానని తెలిపారు.
Danam Nagender
Congress
BRS
Telangana

More Telugu News