Roja: తిరుపతిలో ఇవాళ మేం ఓడి గెలిచాం... వాళ్లు గెలిచి ఓడిపోయారు: రోజా

Roja slams TDP over deputy mayor election in Tirupati
  • తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం
  • తీవ్రస్థాయిలో స్పందించిన రోజా
  • వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచాయని వ్యాఖ్యలు
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం కావడం తెలిసిందే. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమిని ప్రజాస్వామ్య ఓటమిగా రోజా అభివర్ణించారు. ఒక్క ఓటు ఉన్న టీడీపీ కార్పొరేటర్ గెలిచారని వ్యంగ్యం ప్రదర్శించారు.

"మేం విప్ జారీ చేశాం... విప్ ధిక్కరించిన మా సభ్యులను రిటర్నింగ్ అధికారి అనర్హులుగా ప్రకటించాలి... కానీ అలా జరగలేదు... తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు" అని రోజా విమర్శించారు. తాము ఓడిపోలేదని... వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచాయని పేర్కొన్నారు.  

"తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషను విధి నిర్వహణలో అవమానించారు. లోపల కార్పొరేషన్ సమావేశం జరుగుతుంటే... బయట శిరీష ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడడం దేనికి సంకేతం? తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి, నిన్న బస్సులో బయల్దేరిన వైసీపీ కార్పొరేటర్లు నేడు రాకపోవడం, నిన్న మాతో వచ్చి... నేడు మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం గతరాత్రి జరిగిన పరిణామాలకు కొనసాగింపు కాదా" అని రోజా ప్రశ్నించారు.

స్వామివారితో పాటు ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారని రోజా స్పష్టం చేశారు. చివరిగా ఒకటే చెబుతున్నా.... మేం ఓడి గెలిచాం... వాళ్లు గెలిచి ఓడిపోయారు అంటూ వ్యాఖ్యానించారు.
Roja
Deputy Mayor
Tirupati
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News