Nara Lokesh: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ

Minister Nara Lokesh Meet Defence Minister Rajnath Singh
  • ఢిల్లీలోని మంత్రి రాజ్ నాథ్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా క‌లిసిన లోకేశ్‌
  • ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి  
  • అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం అన్ని విధాల‌ స‌హ‌క‌రిస్తూ ఆక్సిజన్ అందిస్తోంద‌ని వ్యాఖ్య
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయ‌న‌కు వివరించారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు.  

డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని తెలిపారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ కు తెలియ‌జేశారు. 

ఇక గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందంటూ ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. 

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు పాల్గొన్నారు.

Nara Lokesh
Rajnath Singh
New Delhi
Andhra Pradesh

More Telugu News