Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

CID serves notices to Ram Gopal Varma in another case
  • 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తీసిన వర్మ
  • తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బండారు వంశీకృష్ణ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన గుంటూరు సీఐడీ పోలీసులు
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను కించపరుస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన కేసులో నిన్న పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు.  

ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను వర్మ తీశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారంటూ గత ఏడాది నవంబర్ 29న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్మపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.
Ram Gopal Varma
Tollywood

More Telugu News