Vishwak Sen: నిజమే.. ఈ వివాదంతో విష్వక్‌సేన్‌కు సంబంధం లేదు..!

True Vishwaksen has nothing to do with this controversy
  • పృథ్వీరాజ్‌ కామెంట్స్‌పై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు 
  • ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ లైలా' హ్యాష్‌ట్యాగ్‌ 
  • క్షమాపణ చెప్పిన విష్వక్‌సేన్‌
విష్వక్‌సేన్‌.. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న యువ కథానాయకుడు. 'ఫలక్‌ నామా దాస్‌', 'ఈ నగరానికి ఏమైంది', 'పాగల్‌' వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే సాధారణంగా ఈ యంగ్‌ హీరో సినిమా విడుదల ముందు ఏదో ఒక వివాదం, ఆ సినిమా గురించి ఏదో ఒక హాట్‌ టాపిక్‌ జరుగుతుంటుంది. కొన్నిసార్లు ప్రీ రిలీజ్‌ వేడుకలో కాస్త వివాదాస్పదంగా మాట్లాడటం, అది వైరల్‌ కావడం ఏదో ఒక రకంగా విష్వక్ సినిమా విడుదల ముందు వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇవన్నీ విష్వక్‌సేన్‌ పబ్లిసిటీ స్టంట్‌ అని కామెంట్స్‌ చేసేవాళ్లు కూడా లేకపోలేదు.  

ఇక, తాజాగా విష్వక్‌సేన్‌ నటించిన 'లైలా' చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఇటీవల జరిగింది. ఈ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో 'లైలా' చిత్ర నటుడు థర్టీ ఇయర్స్‌ పృథ్వీ చేసిన వివాదాస్పద కామెంట్స్‌ వైసీపీ రాజకీయ నాయకులను బాధపెట్టింది. ఇక వైసీపీ అభిమానులు సోషల్‌ మీడియాలో 'బాయ్‌కాట్ లైలా' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు మొదలుపెట్టారు. ఇతర సోషల్ మీడియాలో కూడా పృథ్వీపై కామెంట్స్‌ మొదలయ్యాయి.

జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి హీరో విష్వక్‌సేన్‌, నిర్మాత సాహు గారపాటి కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి పృథ్వీరాజ్‌ కామెంట్స్‌ పట్ల క్షమాపణలు తెలియజేశారు. తమకు తెలియకుండానే ఇలా జరిగిందని, దయచేసి ఎంతో కష్టపడి తీసిన సినిమాను బాయ్‌కాట్ చేయడం సమంజసం కాదని, ఒక్కరు చేసిన తప్పుకు సినిమా టీమ్‌ అందరినీ శిక్షించకూడదని తమ ఆవేదన తెలియజేశారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌కు పృథ్వీరాజ్‌ను కూడా తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తే బాగుండేదని వైసీపీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి, ఇంతటితో ఈ 'లైలా బాయ్‌కాట్' వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. అయితే ప్రతిసారి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక వివాదంతో తెరపైకి వచ్చే హీరో విష్వక్‌సేన్‌ ఈసారి మాత్రం తన ప్రమేయం లేకుండానే మరోసారి వార్తల్లో నిలిచాడు. 
Vishwak Sen
Lailla
Vishwak Sen contraversy
Prudhvi Raj
Lailla press meet
Tollywood

More Telugu News