Prashant Kishor: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఇవే: ప్రశాంత్ కిశోర్ కీలక విశ్లేషణ

Prashant Kishor explains why AAP and Kejriwal lost Delhi elections
  • లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్న పీకే
  • ఇండియా బ్లాక్ లో చేరడం, ఆ తర్వాత బయటకు రావడం కేజ్రీ క్రెడిబిలిటీని దెబ్బతీసిందని వ్యాఖ్య
  • కొన్నేళ్లుగా ఆప్ పాలన పేలవంగా ఉందన్న ప్రశాంత్ కిశోర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాలకు గాను 22 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఓటమిపాలయ్యారు. సీఎంగా ఉన్న అతిశీ మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆప్, కేజ్రీవాల్ ఓటమిపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆప్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై తనదైన శైలిలో విశ్లేషించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వెంటనే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడం అతి పెద్ద మిస్టేక్ అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. బెయిల్ వచ్చిన తర్వాత సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారని... అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని చెప్పారు. దీని కారణంగానే ఎన్నికల్లో ఆప్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. 

ఎన్నికలకు వెళ్తున్న సమయంలో మరో వ్యక్తిని సీఎం చేయడం కూడా తప్పేనని పీకే అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీకి ఒక అస్త్రంగా మారిందని చెప్పారు. రాజకీయపరంగా కేజ్రీవాల్ అస్థిరంగా వ్యవహరించారని తెలిపారు. తాను వ్యతిరేకించిన సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారున్న ఇండియా కూటమిలో చేరడం... ఆ తర్వాత ఇండియా బ్లాక్ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వంటివి ఆయన అస్థిరత్వానికి నిదర్శనమని చెప్పారు. ఎన్నికల్లో ఇది ఆప్ ను భారీగా దెబ్బతీసిందని అన్నారు. 

పదేళ్లుగా ఉన్న యాంటీ ఇంకంబెన్సీ (ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత) కూడా ఆప్ ఓటమికి అతిపెద్ద కారణమని పీకే చెప్పారు. రెండో కారణం... కేజ్రీవాల్ రాజీనామా అని... లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు. బెయిల్ వచ్చిన తర్వాత రాజీనామా చేయడం... ఎన్నికలకు ముందు మరో వ్యక్తిని సీఎం చేయడం అనేది కేజ్రీవాల్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని అన్నారు. 

మూడో కారణం... ఇండియా బ్లాక్ లో చేరడం, ఆ తర్వాత కూటమి నుంచి బయటకు రావడం కేజ్రీవాల్ క్రెడిబిలిటీని దారుణంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. దీనికి తోడు గత కొన్నేళ్లుగా ఆప్ పాలన పేలవంగా ఉందని చెప్పారు. దారుణంగా తయారైన రోడ్లు, వాటర్ లాగింగ్ సమస్య కూడా ఆప్ ను భారీగా దెబ్బతీశాయని తెలిపారు. 

మరోవైపు, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 48 సీట్లతో జయకేతనం ఎగురవేసింది. 10 ఏళ్ల ఆప్ పాలనకు ముగింపు పలికిన బీజేపీ... 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేజ్రీవాల్ ను 4 వేలకు పైగా ఓట్లతో ఓడించిన పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు.
Prashant Kishor
Arvind Kejriwal
AAP
Delhi Elections

More Telugu News