Ambati Rambabu: వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావడం లేదు: అంబటి రాంబాబు

Ambati Rambabu responds on Vallbhaneni Vamshi Arrest
  • వల్లభనేని వంశీ అరెస్టుపై వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వచ్చామన్న అంబటి
  • కుట్రపూరితంగా, అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణ
  • వంశీని కలిసేందుకు భార్య వచ్చినా ఆంక్షలు పెట్టారని ఆవేదన
తమ పార్టీ నేత వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని, దీనిపై దిగ్భ్రాంతికి గురయ్యామని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వల్లభనేని వంశీ ఒకటి రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఆ కేసులో ఆయన కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేదని భావించామని ఆయన పేర్కొన్నారు.

వల్లభనేని వంశీ అరెస్టుపై వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. వంశీని ఎందుకు అరెస్టు చేశారో సరైన కారణం చెప్పలేదని అన్నారు. కుట్రపూరితంగా, అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తప్పుడు కేసు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వంశీ టీడీపీ నుండి వైసీపీలోకి రావడంతో చంద్రబాబు, లోకేశ్ కక్ష కట్టారని ఆరోపించారు. ఇది తప్పుడు కేసు అని అందరికీ అర్థమవుతోందని అన్నారు.

వంశీని కలిసేందుకు ఆయన భార్య వచ్చినా అనేక ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. దీనిపై డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు ఆపాయింట్‌మెంట్ తీసుకున్నామని, కానీ తాము వచ్చాక ఆయన కార్యాలయం నుండి వెళ్లిపోయారని అన్నారు. తమ వినతి పత్రాన్ని ఎవరూ తీసుకోలేదని ఆరోపించారు. వినతి పత్రం తీసుకోకపోవడమేమిటో అర్థం కావడం లేదని వాపోయారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని ఆయన అన్నారు. తమ వినతి పత్రాన్ని తీసుకోవడానికి ఎవరైనా వస్తారా? లేక తామే మళ్లీ వచ్చి కలవాలా? అనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు.
Ambati Rambabu
Vallabhaneni Vamsi
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News