BJP: ఈ నెల 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

Delhi CM Oath Likely On February 19
  • ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • సోమ, మంగళ వారాల్లో సమావేశం కానున్న బీజేపీ శాసనసభా పక్షం
  • ఈ భేటీలో కొత్త ముఖ్యమంత్రిపై స్పష్టత
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని భారతీయ జనతా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత వారం విడుదలైన విషయం విదితమే. బీజేపీ గెలిచినా, ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో బీజేపీ శాసనసభా పక్ష నేతలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం అనంతరం నూతన మూఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రానుంది.

15 మందితో షార్ట్ లిస్ట్

ఎన్నికల్లో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో 15 మందితో అధిష్ఠానం ఓ జాబితా రూపొందించింది. ఇందులో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
BJP
New Delhi
Chief Minister

More Telugu News