Raghunandan Rao: మోదీ కులంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... రఘునందన్ రావు కౌంటర్

Raghunandan Rao counter to Revanth Reddy on PM Modi caste
  • రాహుల్ గాంధీ కులమేమిటో చెప్పాలని రఘునందన్ రావు నిలదీత
  • మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్న ఎంపీ
  • మోదీ కేబినెట్లో 17 మంది బీసీలు ఉన్నారన్న రఘునందన్ రావు
  • రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇద్దరే ఉన్నారని వ్యాఖ్య
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు గట్టిగా బదులిచ్చారు. ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే ముందు, మొదట రాహుల్ గాంధీ కులం ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారని రఘునందన్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

కుల గణనలో పాల్గొనాలని చట్టంలో ఎక్కడైనా రాసి ఉందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కుల గణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని కొందరు అంటున్నారని, అలా చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీశారు. అసలు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు.

నరేంద్ర మోదీ కేబినెట్లో 17 మంది బీసీలు ఉన్నారని, కానీ రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇద్దరే బీసీ మంత్రులు ఉన్నారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మోదీ కులం ఓసీ నుండి బీసీకి మారిందని ఇప్పుడే కనిపెట్టినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Raghunandan Rao
BJP
Revanth Reddy
Narendra Modi

More Telugu News