Walking: ఖాళీ కడుపుతోనా.. తిన్న తర్వాతా... బరువు తగ్గేందుకు ఏ వాకింగ్ కరెక్ట్?

- మారిన జీవన శైలితో చాలా మందిలో అధిక బరువు సమస్య
- మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటి బారినపడుతున్నవారూ ఎందరో...
- వీటి నుంచి బయటపడేందుకు వాకింగ్.. ఎలా చేస్తే మంచిదనే అంశంపై నిపుణుల సూచనలు
ఇటీవలి కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ లేని జీవితం, అధిక కేలరీలు ఉండే ఆహారం వంటివి దీనికి కారణం అవుతున్నాయి. దీనితో ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ముసురుకుంటున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది వాకింగ్ మొదలుపెడుతున్నారు. అయితే శరీరంలో ఎక్కువ కేలరీలు కరిగి, వేగంగా బరువు తగ్గేందుకు ఏ విధానం అనుసరిస్తే మంచిదన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. భోజనం చేశాక, లేదా ఏమైనా తిన్నాక వాకింగ్ చేయాలా?... ఖాళీ కడుపుతో వాకింగ్ చేయాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే...
ఖాళీ కడుపుతో వాకింగ్ తో ఏంటి ప్రయోజనం?
అల్పాహారం తీసుకున్నాక వాకింగ్ తో ప్రయోజనమేంటి?
ఎవరికి ఏది మంచిది?
ఖాళీ కడుపుతో వాకింగ్ తో ఏంటి ప్రయోజనం?
- ఎవరైనా ఉదయమే ఖాళీ కడుపుతో అంటే ఏమీ తినకుండా పరగడపున వాకింగ్ చేస్తే... వారిలో శక్తి కోసం శరీరం కొవ్వును కరిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో వ్యాయమం చేసేవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంటున్నారు.
- అయితే ఇలా పరగడపున మరీ తీవ్రమైన వ్యాయామం చేయడం వల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. రక్తంలో తగినమేర కార్బోహైడ్రేట్లు (గ్లూకోజ్ నిల్వలు) లేకుంటే.. వెంటనే ప్రొటీన్లను శక్తి కోసం ఉపయోగించుకోవడం మొదలుపెడుతుందని వివరిస్తున్నారు.
- తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు కండరాలు పునరుద్ధరణ చెందడానికి ప్రొటీన్లు అత్యవసరమని.. లేకుంటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువ దూరం, వేగంగా వాకింగ్ చేసినప్పుడు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
- అయితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు ఖాళీ కడుపుతో ఓ మోస్తరు వాకింగ్, వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనమే ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.
అల్పాహారం తీసుకున్నాక వాకింగ్ తో ప్రయోజనమేంటి?
- ఎవరైనా భోజనం/ లేదా అల్పాహారం తీసుకున్న తర్వాత వాకింగ్ చేస్తే.. వారి శరీరంలో విడుదలవుతున్న శక్తి అప్పటికప్పుడే ఖర్చవుతూ ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నవారికి ఇది మేలు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
- అయితే ఎక్కువ దూరం, వేగంగా వాకింగ్ చేయడం, కఠిన వ్యాయామాలు చేసేవారిలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు అల్పాహారం తర్వాత వాకింగ్, వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారు పరగడుపుతో వాకింగ్ చేస్తే... ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
- ఇక భోజనం తర్వాత వాకింగ్ చేసినప్పుడు ఆహారం బాగా జీర్ణం అవుతుందని.. ఎసిడిటీ, గ్యాస్, ఇతర జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరమని చెబుతున్నారు.
ఎవరికి ఏది మంచిది?
- బరువు తగ్గాలనుకునే వారికి ఉదయమే పరగడుపున వాకింగ్, వ్యాయామం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల వారి శరీరంలో కొవ్వు కరుగుతుందని వివరిస్తున్నారు.
- అదే ఫిట్ నెస్ కోసం వాకింగ్, వ్యాయామం చేసేవారికి కాస్త అల్పాహారం తర్వాత వాకింగ్, వ్యాయామంతో ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
- అయితే వాకింగ్, వ్యాయామం తర్వాత అతిగా ఆహారం తీసుకోవడం, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
- వాకింగ్, వ్యాయామం ఏదైనా సరే వ్యక్తుల శారీరక, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుందని... వీలైనంత వరకు వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు వ్యవహరించడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.