Champions Trophy 2025: ఆ విష‌యంలో బీసీసీఐ యూట‌ర్న్‌.. టీమిండియా ఆట‌గాళ్ల‌కు ఊర‌ట‌!

BCCI Allows Players To Stay With Wives During Champions Trophy Says Report But On One Condition
  • రేప‌టి నుంచి ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 
  • భార‌త ప్లేయ‌ర్ల‌కు స్వల్ప ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌యం తీసుకున్న బీసీసీఐ
  • దుబాయ్‌కి ఆట‌గాళ్లు త‌మ కుటుంబస‌భ్యుల‌ను వెంట తెచ్చుకునే వెసులుబాటు 
  • అది కూడా కేవ‌లం ఒక్క మ్యాచ్ కు మాత్ర‌మే!
భాగ‌స్వాములు, కుటుంబ స‌భ్యుల‌ను ఆటగాళ్లు త‌మ వెంట తీసుకెళ్లే విష‌య‌మై బీసీసీఐ యూట‌ర్న్ తీసుకుంది. దుబాయ్ లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత క్రికెట్ జట్టు సభ్యుల కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకెళ్లడానికి అనుమతించినట్లు తెలుస్తోంది. 

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ లో ఘోర ప‌రాజ‌యం తర్వాత కొన్ని నియమాలను మారుస్తూ బోర్డు 10 పాయింట్లతో కూడిన ఆదేశాల‌ను జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ప్లేయ‌ర్లు త‌మ‌ కుటుంబ సభ్యులు, భాగ‌స్వాముల‌ను త‌మ వెంట తీసుకెళ్లే విష‌యమై క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. అయితే, ఇప్పుడు 'నో ఫ్యామిలీ రూల్‌' నుంచి ఆటగాళ్లకు స్వల్ప ఊర‌ట‌నిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. 

దుబాయ్‌కి ప్లేయ‌ర్లు త‌మ కుటుంబస‌భ్యుల‌ను వెంట తెచ్చుకోవ‌చ్చ‌ని బోర్డు చెప్పింద‌ట‌. అయితే, ఇందుకో ష‌ర‌తు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ కు మాత్ర‌మే ఇలా ప్లేయ‌ర్ల వెంట కుటుంబ‌స‌భ్యుల‌ను అనుమ‌తిస్తామ‌ని బీసీసీఐ చెప్పిన‌ట్లు స‌మాచారం. 

ఈ మేర‌కు 'దైనిక్ జాగరణ్' త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఈ విష‌య‌మై ఆటగాళ్లు తమలో తాము చర్చించుకుని, దాని కోసం బీసీసీఐకి అభ్యర్థన చేసుకోవాల‌ని చెప్పిన‌ట్లు క‌థ‌నం తెలిపింది. ఆ తర్వాత అందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాట్లు చేస్తుంద‌ని పేర్కొంది.

కాగా, బోర్డు 10 పాయింట్లతో కూడిన ఆదేశాల ప్రకారం... 45 రోజులకు పైగా విదేశీ పర్యటనల సమయంలో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్లతో కుటుంబాలు ఉండటానికి ఆమోదించింది. అంతేకాకుండా వ్యక్తిగత సిబ్బంది, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ చిత్రీకరణలపై ఆంక్షలు విధించిన విష‌యం తెలిసిందే.

ఇక రేపు (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 20న జరిగే తొలి మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడనుంది.
Champions Trophy 2025
BCCI
Team India
Cricket
Sports News

More Telugu News