Etela Rajender: బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా: రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సూచన

Etala Rajendar questions Revanth Reddy about Bayyaram Factory
  • ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే పరిశ్రమ పెట్టాలని సూచన
  • కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు వచ్చాయన్న ఈటల రాజేందర్
  • రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీత
బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చు కదా అని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ పరిశ్రమను నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వవచ్చని సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు భారీగానే నిధులు కేటాయించామని వెల్లడించారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం రూ.6,300 కోట్లు మంజూరు చేసిందని ఆయన అన్నారు. కాజీపేటలో కోచ్ రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇంత చేస్తుంటే, బయ్యారంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవచ్చు కదా అని ఆయన అన్నారు.

రాష్ట్రాల వారీగా కులగణనకు తమ పార్టీ అనుకూలమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
Etela Rajender
Telangana
BJP

More Telugu News