Tea stall: కేటీఆర్ ఫొటో పెట్టుకున్నందుకు సిరిసిల్లలో టీస్టాల్ మూసివేయించారు... యజమాని ఆవేదన

Municipal Officials Closed Tea Stall In Siricilla Creates Political Drama
ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో చర్యలు తీసుకున్నామని అధికారుల వివరణ
కేటీఆర్ ఫొటో తీసేయడానికి నిరాకరించడంతో కక్ష కట్టారని ఓనర్ ఆరోపణ
నాలుగేళ్లుగా అక్కడే, అదే పేరుతో టీ స్టాల్ నడుపుతున్నట్లు వెల్లడి 
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరు, ఫొటో పెట్టుకున్నందుకు అధికారులు తన టీ స్టాల్ మూసివేయించారని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. కలెక్టర్ కక్ష గట్టి తన టీస్టాల్ బలవంతంగా మూసివేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ నగరంలోని బతుకమ్మ ఘాట్ లో టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తున్నారు. కేటీఆర్ మీద అభిమానంతో తన టీ స్టాల్ కు ఆయన పేరే పెట్టుకున్నానని, ఆయన ఫొటోలను ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. గత నాలుగేళ్లుగా అదే ప్రాంతంలో టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. 

ఇటీవల మున్సిపల్ అధికారులు టీ స్టాల్ వద్దకు వచ్చి కేటీఆర్ ఫొటో తొలగించాలని చెప్పారన్నారు. టీస్టాల్ లేకపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం కేటీఆర్ ఫొటో తొలగించబోనని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహించి తన టీ స్టాల్ ను బలవంతంగా మూసివేయించాడని ఆరోపించారు. సిరిసిల్లలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదంటూ బత్తుల శ్రీనివాస్ మీడియా ముందు వాపోయారు. కాగా, ఈ విషయంపై మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తూ... టీ స్టాల్ కు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్నందుకే టీ స్టాల్ ను మూసివేయించామని వివరించారు.
Tea stall
KTR Tea Stall
Siricilla
Viral Videos
Municipal Office

More Telugu News