Rekha Gupta: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు

5 out of 7 newly sworn in Delhi ministers face criminal cases
  • మంత్రి ఆశిష్ సూద్‌పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు వెల్లడించిన ఏడీఆర్
  • ఏడుగురు కేబినెట్ మంత్రుల్లో ఇద్దరు బిలియనీర్లు
  • కేజ్రీవాల్‌ను ఓడించిన మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్‌కు రూ.74.36 కోట్ల అప్పులు
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ఆరుగురు ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి సహా ఏడుగురిలో ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపింది.

మంత్రి ఆశిష్ సూద్‌పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ఏడీఆర్ దీనిని నిర్ధారించింది. ఢిల్లీలోని షాలిమార్‌బాగ్ నుండి రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది.

ఏడుగురు కేబినెట్ మంత్రుల్లో ఇద్దరు బిలియనీర్లు ఉన్నారు. రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుండి గెలిచిన మంజీందర్ సింగ్ సిర్సా సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా అతనికి రూ.248.85 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కరావాల్ నగర్ నియోజకవర్గానికి చెందిన మంత్రి కపిల్ మిశ్రాకు అత్యల్పంగా రూ.1.06 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏడుగురు మంత్రుల సగటు ఆస్తి రూ.56.03 కోట్లు.

తమకు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి సహా కేబినెట్‌లోని ఏడుగురు మంత్రులు వెల్లడించారు. పర్వేష్ సాహిబ్ సింగ్‌కు అత్యధికంగా రూ.74.36 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆరుగురు గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి విద్యార్హతలను ప్రకటించారు. ఒక మంత్రి పన్నెండో తరగతి పూర్తి చేశారు.
Rekha Gupta
New Delhi
BJP

More Telugu News