Zomato: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌కు ఎనిమిదో తరగతి విద్యార్థిని లేఖ!

Class 8 student writes letter to Zomato CEO Deepinder Goyal
  • 'ఫీడ్ ఇండియా'తో ఎంతోమంది ఆకలి తీరుస్తోందని గోయల్‌కు లేఖ రాసిన విద్యార్థిని
  • తమ గురించి ఆలోచించే వారు ఉన్నందుకు ఆనందంగా ఉందన్న విద్యార్థిని
  • భవిష్యత్తులో మీలాగే ఇతరులకు సాయం చేస్తానని గోయల్‌కు విద్యార్థిని లేఖ
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌కు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని లేఖ రాసింది. జొమాటో ఫుడ్ డెలివరీతో పాటు తన యాప్ ద్వారా 'ఫీడింగ్ ఇండియా' కార్యక్రమానికి విరాళాలను సేకరిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 19 కోట్ల మంది ఆకలిని తీర్చగలిగామని గోయల్ పేర్కొన్నారు. వినియోగదారుల చొరవతో ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. 

ఫీడ్ ఇండియాకు సంబంధించి ఎనిమిదో తరగతి విద్యార్థిని లేఖ రాసినట్లు దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఫీడ్ ఇండియా నిత్యం తమ ఆకలిని తీరుస్తోందని, ఇందుకు ఆ టీంకు ధన్యవాదాలు అంటూ విద్యార్థిని ఆ లేఖలో పేర్కొంది. తమ గురించి కూడా ఆలోచించేవారు ఉన్నందుకు ఆనందం కలిగిస్తోందని పేర్కొంది.

తమతో వ్యక్తిగత పరిచయం లేకపోయినప్పటికీ సాయం అందిస్తున్నారని, ఈ సాయం ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకువచ్చిందని అందులో పేర్కొంది. ఇప్పుడు చదువుకుంటున్నానని, భవిష్యత్తులో నేను కూడా మీలాగే ఇతరులకు సాయం చేస్తానని దీపిందర్ గోయల్‌ను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో పేర్కొంది.

ఈ లేఖపై దీపిందర్ గోయల్ స్పందించారు. తాము చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరిస్తున్నారని చెబుతూ, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
Zomato
deepinder Goyal
Student

More Telugu News