AP High Court: సోషల్ మీడియా పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

high courts key comments on social media posts orders to ap government
  • సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ 
  • అసభ్య పోస్టులపై తీసుకుంటున్న చర్యల వివరాలు ధర్మాసనం ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశం
  • తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునేందుకు చేసే వ్యాఖ్యలతో అంతిమంగా సామాజిక మాధ్యమ సంస్థలు లాభపడుతున్నాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం .. సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తుందన్న కారణంతో వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 

సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సందర్భంలో హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. 
 
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ, అసభ్య పోస్టులు పెట్టిన వ్యవహారంపై సజ్జల భార్గవ రెడ్డి తదితరులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.  
AP High Court
AP Government
Social Media Posts

More Telugu News