Shivraj Singh Chouhan: విమానంలో విరిగిన సీటులో కూర్చుని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి

Union minister Shivraj Singh travels Bhopal to New Delhi sitting in broken seat in Airiindia plane
  • కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం చేసిన శివరాజ్ సింగ్
  • ఎయిరిండియా విమానం ఎక్కిన వైనం
  • విరిగిన సీట్లో కూర్చుని గంటన్నర ప్రయాణం
  • ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం 
  • క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్ సంస్థ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిరిండియా విమానంలో ఆయన విరిగిన సీటులో కూర్చుని గంటన్నర పాటు ప్రయాణించాల్సి వచ్చింది. 

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీ ప్రయాణించారు. ఎయిరిండియా విమానం ఎక్కిన ఆయన తాను బుక్ చేసుకున్న సీటు విరిగిపోయి ఉండడాన్ని గుర్తించారు. దాంతో ఆయన విమానసిబ్బందిని పిలిచి, సీటు విరిగిపోయిన విషయం వారికి తెలియజేశారు. విమానంలో ఇదొక్కటే కాదు... మరి కొన్ని సీట్లు కూడా విరిగిపోయి ఉన్నాయన్న సమాధానం వారి నుంచి వినిపించింది. ఈ విషయం మేనేజ్ మెంట్ కు కూడా తెలుసని, విరిగిన సీటును ఎవరికీ కేటాయించవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని వారు కేంద్రమంత్రికి తెలిపారు. 

కాగా, ఆ విమానంలో తాను పడుతున్న ఇబ్బందిని గమనించి ఇతర ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని ఆఫర్ చేశారని, అయితే వారిని ఇబ్బందిపెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో విరిగిన సీటులోనే కూర్చుని ఢిల్లీ వచ్చానని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. 

ఎయిరిండియా సంస్థను టాటా గ్రూప్ హస్తగతం చేసుకున్నాక, ఆ విమానయాన సంస్థ పరిస్థితులు బాగుపడతాయని భావించానని, కానీ, అది తన భ్రమ అని ఇప్పుడు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఓ టికెట్ కు పూర్తి ఛార్జీ వసూలు చేసినప్పుడు, ఇలాంటి విరిగిపోయిన సీట్లు కేటాయించడం మోసపూరితం కాదా అని శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

కేంద్రమంత్రి ట్వీట్ పై ఎయిరిండియా స్పందించింది. ఆయనకు క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది.
Shivraj Singh Chouhan
Broken Seat
Air India
Bhopal-Delhi

More Telugu News