KTR: కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే ఉద్యోగం పోతుందని రేవంత్ రెడ్డికి భయం: కేటీఆర్

KTR says Revanth Reddy is not have guts to question Centre
  • కృష్ణా జలాల విషయంలో ఉత్తరం రాసి చేతులు దులిపేసుకున్నారని విమర్శ
  • రేవంత్ రెడ్డి 'ఆర్' ట్యాక్స్‌పై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతోందని ప్రశ్న
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తన ఉద్యోగం పోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కేవలం ఉత్తరం రాసి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతామని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ నల్గొండలో ధర్నా చేసిన తర్వాతనే అసెంబ్లీలో ఈ అంశంపై తీర్మానం చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి చేతనైతే 'ఆర్' ట్యాక్స్‌పై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. ఆయన బీజేపీలో చేరతారని లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందా? అని నిలదీశారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది అక్రమాలకు పాల్పడ్డాడని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడులు చేసిందని, అయినప్పటికీ చర్యలు లేవని విమర్శించారు. సుంకిశాల ప్రమాదంలో కూడా రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడుతున్నారో తెలుసని కేటీఆర్ అన్నారు.
KTR
Telangana
Revanth Reddy
Narendra Modi
Bandi Sanjay

More Telugu News