Australia: ఇంగ్లిస్ విధ్వంసక సెంచరీ... వారెవ్వా ఆస్ట్రేలియా... ఇంగ్లండ్ పై అద్భుత విజయం

Aussies beat England by 5 wickets with Josh Inglis heroic century
  • ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు పరుగుల వెల్లువ
  • 352 పరుగుల టార్గెట్ ను 47.3 ఓవర్లలోనే ఛేదించిన ఆసీస్
  • 86 బంతుల్లో 120 పరుగులు చేసిన జోష్ ఇంగ్లిస్
ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల మోత మోగిన నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ పోరులో ఆసీస్ 352 పరుగుల టార్గెట్ ను సక్సెస్ పుల్ గా చేజ్ చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోష్ ఇంగ్లిస్ (120 నాటౌట్) వీరోచితసెంచరీతో తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ట్రావిస్ హెడ్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) స్వల్ప స్కోర్లకే అవుటైన స్థితిలో... ఇంగ్లిస్ బ్యాట్ తో వీరవిహారం చేశాడు. 86 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లిస్ కు తోడు ఆఖర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా జట్టు మరో 15 బంతులు మిగిలుండగానే... 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్ వెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ (63), అలెక్స్ కేరీ (69) అర్ధసెంచరీలతో రాణించారు. మార్నస్ లబుషేన్ 47 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ ఉడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, అదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టన్ తలో వికెట్ తీశారు. 

లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ (165) భారీ సెంచరీ సాయంతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగులు చేసింది.

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు రోమాంఛక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
Australia
Josh Inglis
England
Champions Trophy 2025

More Telugu News