Illegal Immigrants: తొలిసారి కాళ్లు, చేతులకు సంకెళ్లు లేకుండానే అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న అక్రమ వలసదారులు

12 Illegal Immigrants Reach Delhi From Panama With Out Restraints
  • అమెరికా డిపోర్టేషన్ కార్యక్రమానికి పనామా సహకారం   
  • సరైన పత్రాలు లేని వారిని పనామా పంపుతున్న అమెరికా
  • అక్కడి నుంచి స్వదేశాలకు వెళుతున్న వలసదారులు
  • ఇటీవల పనామా చేరుకున్న 50 మందిలో 12 మంది భారత్‌కు
  • జాతీయత నిర్ధారణ తర్వాత వచ్చే వారం మరింత మంది భారత్‌కు
అక్రమ వలసదారులను ఏరివేస్తున్న అమెరికా మరో 12 మంది భారతీయులను పనామాకు పంపించింది. అక్కడి నుంచి వారు నిన్న టర్కిష్ ఎయిర్ లైన్స్‌లో ఇస్తాంబుల్ మీదుగా భారత్ కు చేరుకున్నారు. తొలిసారి వీరికి ఎలాంటి బంధనాలు లేకుండా వెనక్కి పంపారు. అమెరికా ఇప్పటి వరకు మూడు మిలటరీ విమానాల్లో 332 మంది భారతీయులను తిప్పి పంపగా, వారందరికీ సంకెళ్లు వేయడం తెలిసిందే. అయితే, తాజాగా తిప్పి పంపిన 12 మందిని స్వేచ్ఛగా తరలించడం గమనార్హం.

అమెరికా బహిష్కరణ కార్యక్రమానికి పనామా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను అమెరికా పనామాకు తరలిస్తోంది. అక్కడి నుంచి వారు తమ దేశాలకు చేరుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 50 మంది భారతీయులను అమెరికా ఇటీవల పనామాకు తరలించింది. వారిలో 12 మంది నిన్న భారత్ కు చేరుకున్నారు. బహిష్కృతులు స్వదేశాలు చేరుకునేందుకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్’ సాయం చేస్తోంది. ముఖ్యంగా, విమాన టికెట్లు కొనుగోలులో వారికి సాయం చేస్తోంది. 

కాగా, పనామా చేరుకున్న బహిష్కృతుల జాతీయతను భారత విదేశాంగ శాఖ నిర్ధారించిన తర్వాత వచ్చే వారం మరింతమంది స్వదేశం చేరుకునే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 5న అమృత్‌సర్ చేరుకున్న అమెరికా మిలటరీ విమానంలో 104 మంది, 15న వచ్చిన రెండో విమానంలో 119 మంది, 16న వచ్చిన మూడో విమానంలో 112 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరందరి కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి తీసుకురాగా, తాజాగా ఢిల్లీకి చేరుకున్న 12 మంది మాత్రం ఎలాంటి బంధనాలు లేకుండానే రావడం గమనార్హం.
Illegal Immigrants
USA
Panama
India

More Telugu News