Pakistan: ఛాంపియ‌న్స్ ట్రోఫీని టార్గెట్ చేసిన పాకిస్థానీ టెర్ర‌రిస్టు గ్రూపులు... హై అల‌ర్ట్ ప్ర‌క‌ట‌న‌!

Pakistan On High Alert After Terrorist Attack Threat During ICC Champions Trophy Says Report
  • మ్యాచ్ ల‌ను వీక్షించ‌డానికి వ‌చ్చిన‌ విదేశీయుల‌ను కిడ్నాప్ చేయ‌డానికి ప‌థ‌కం 
  • ఈ మేర‌కు ఆ దేశ ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం
  • ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో హై అలర్ట్ జారీ
పాకిస్థానీ టెర్ర‌రిస్టు గ్రూపులు ప్ర‌స్తుతం ఆ దేశంలో జ‌రుగుతున్న ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియ‌న్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు గుర్తించాయి. మ్యాచ్ ల‌ను వీక్షించ‌డానికి వ‌చ్చిన‌ విదేశీయుల‌ను కిడ్నాప్ చేయ‌డానికి ప‌థ‌కం వేసిన‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), ఐసిస్, బ‌లూచిస్థాన్‌లోని గ్రూపులు విదేశీయులను అపహరించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం హై అలర్ట్ జారీ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీ అతిథులను అపహరించే అవకాశం ఉందని ఈ సంద‌ర్భంగా భద్రతా దళాలను హెచ్చరించింది. 

దాదాపు 26 ఏళ్ల త‌ర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాక్‌కు ఇది ఊహించ‌ని షాక్‌. దేశంలో క్రికెట్‌ను పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు పాకిస్థాన్‌లో భద్రతా సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించవలసి వచ్చింది. భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఇంతలో ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం నేపథ్యంలో పాక్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

టోర్నీలో ఆతిథ్య జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పేలవంగా ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆదివారం నాడు భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఇలా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌ముల‌తో వారు సెమీఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్ర‌మించినట్లే. పాక్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప అది సాధ్య‌ప‌డ‌దు.
Pakistan
Champions Trophy 2025
High Alert
Terrorist Attack Threat
Cricket
Sports News

More Telugu News