Sri Reddy: శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Relief for actress Sri Reddy in social media posts case
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆరు కేసుల నమోదు
  • విశాఖపట్నంలో నమోదైన కేసులో బెయిలు
  • వారానికోసారి దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశం
  • చిత్తూరు కేసులో బెయిలు పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన శ్రీరెడ్డిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నమోదైన కేసులో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని ఆదేశించింది. మరోవైపు, చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

కాగా, అనకాపల్లిలో నమోదైన కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సాయిరోహిత్ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియా పోస్టుల్లో శ్రీరెడ్డి అత్యంత అభ్యంతరకరమైన భాష వాడినట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వారం పాటు వాయిదా వేశారు. అలాగే, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. 
Sri Reddy
YSRCP
Chandrababu
Nara Lokesh
Vangalapudi Anitha
AP High Court

More Telugu News