Bandi Sanjay: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే స్వాగతిస్తాం: బండి సంజయ్

Bandi Sanjay says BJP will welcome if BCs get 42 percent reservations
  • రేషన్ కార్డుల ప్రకారం రాష్ట్రంలో 4.3 కోట్ల జనాభా ఉందన్న బండి సంజయ్
  • కులగణన సర్వేలో 3.7 కోట్లు ఉన్నట్లు వచ్చిందన్న కేంద్ర సహాయమంత్రి
  • మిగిలిన 60 లక్షల మంది ఏమయ్యారో చెప్పాలని ప్రశ్న
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటే తాము స్వాగతిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేషన్ కార్డుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 4.3 కోట్ల మంది జనాభా ఉన్నారని ఆయన వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 3.7 కోట్ల మంది మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. మిగిలిన 60 లక్షల మంది ఏమయ్యారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మంచిదేనని, కానీ ముస్లిం రిజర్వేషన్లు పది శాతం కలుపుకొని 42 శాతం అంటున్నారని, అప్పుడు బీసీలకు 32 శాతమే అవుతుందని ఆయన అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఉపాధి రంగాల్లో బీసీలకు ఇప్పటి వరకు 27 శాతం ఇస్తున్నారని, ఇప్పుడు 32 శాతం అంటే ఐదు శాతమే పెరిగినట్లు అవుతుందని విమర్శలు గుప్పించారు. 42 శాతం బీసీలకు అని చెప్పి, 10 శాతం ముస్లింలకు ఇస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 3.90 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయని, ఆధార్ కార్డు తీసుకోని వారు మరో 30 లక్షల మందికి పైగా ఉండి ఉంటారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని సుమారు 4.30 కోట్ల జనాభాలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 3.7 కోట్లు అని ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అందుకే కులగణన తప్పు అని చెబుతున్నామని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay
Telangana
BRS
BJP

More Telugu News