Champions Trophy 2025: టీమిండియాకు ఇది బాగా కలిసొచ్చే అంశం అంటున్న ఇంగ్లండ్ మాజీలు

Michael Atherton and Nasser Hussain Comments on Team India Matches Venue in Champions Trophy 2025
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీలో వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
  • త‌న మ్యాచ్‌ల‌న్నింటినీ దుబాయ్ వేదిక‌గా ఆడుతున్న భార‌త జ‌ట్టు
  • ఇలా ఒకే వేదిక‌పై ఆడుతుండ‌టం భార‌త్‌కు బాగా కలిసొచ్చే అంశమ‌న్న నాజ‌ర్ హుస్సేన్‌, మైకేల్ అథ‌ర్ట‌న్
  • ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు ప్యాట్ క‌మిన్స్ 
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజ‌యంతో రోహిత్ సేన సెమీ ఫైన‌ల్‌కి వెళ్ల‌గా.. ఆతిథ్య పాకిస్థాన్ మాత్రం రెండు ప‌రాజ‌యాల‌తో టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇక‌ భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా... ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం భార‌త జ‌ట్టును పాకిస్థాన్‌కు పంపించేందుకు బీసీసీఐ నిరాక‌రించ‌డంతో... టోర్నీని ఐసీసీ హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌త్‌ త‌న మ్యాచ్‌ల‌న్నింటినీ దుబాయ్ వేదిక‌గా ఆడుతోంది. 

సెమీస్ కూడా ఇదే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఒక‌వేళ టీమిండియా ఫైన‌ల్‌కి వెళితే... ఆ మ్యాచ్ కూడా ఇక్క‌డే నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు త‌న మ్యాచ్‌ల‌న్నింటినీ ఒకే వేదిక‌పై ఆడుతుండ‌టంపై ఇంగ్లండ్ మాజీ సార‌థులు నాజ‌ర్ హుస్సేన్‌, మైకేల్ అథ‌ర్ట‌న్ తాజాగా స్పందించారు. 

ఇత‌ర జ‌ట్ల మాదిరిగా ఎక్క‌డికి వెళ్ల‌కుండా ఒకే స్టేడియంలో మ్యాచ్‌లు ఆడ‌టం అనేది భార‌త జ‌ట్టుకు క‌లిసొచ్చే అంశ‌మ‌ని పేర్కొన్నారు. "ఒకే వేదిక‌లో మ్యాచ్‌లు ఆడ‌టం వారికి లాభిస్తోంది. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయ‌నే అంచ‌నాల‌తో టీమిండియా ఎక్కువ మంది స్పిన్న‌ర్ల‌ను ఎంపిక చేసింది. అదే పాక్‌, ఇంగ్లండ్ జ‌ట్లు ఒక‌రిద్ద‌రూ స్పిన్న‌ర్ల‌తోనే బ‌రిలోకి దిగాయి. ఇక పాక్‌లో మ్యాచ్‌లు ఆడే టీమ్‌లు అక్క‌డి ప‌రిస్థితుల‌కి అనుగుణంగా ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అక్క‌డి వాతావ‌ర‌ణానికి కూడా అల‌వాటు ప‌డాలి. అందుకే ఒకే వేదిక‌లో మ్యాచ్‌లు ఆడ‌టం ప్రయోజనకరంగా మారింది" అని నాజ‌ర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. 

అలాగే మైకేల్ అథ‌ర్ట‌న్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. "భార‌త జ‌ట్టు దుబాయ్‌లో మాత్ర‌మే మ్యాచ్‌లు ఆడ‌టం వ‌ల్ల ఎంత‌మేర‌కు ప్ర‌యోజ‌నం పొందుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ, ఎంతో కొంత లాభం మాత్రం క‌చ్చితంగా ఉంటుంది. ఇత‌ర టీమ్‌ల మాదిరిగా టీమిండియా ఎక్క‌డికి ప్ర‌యాణించాల్సిన అవ‌స‌రం లేదు. ఒకే మైదానంలో ఆడితే అక్క‌డి ప‌రిస్థితుల‌పై దృష్టిసారించ‌డం కూడా సులువు అవుతుంది. ఇది ఆ జ‌ట్టుకు క‌లిసొచ్చే అంశం" అని అథ‌ర్ట‌న్ తెలిపాడు.    

కాగా, ఇదే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు ప్యాట్ క‌మిన్స్ కూడా వ్య‌క్తం చేశాడు. టీమిండియా దుబాయ్‌లోని ఒకే స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు ఆడుతుండ‌టం ఆ జ‌ట్టుకు అడ్వాంటేజ్ అని క‌మిన్స్ పేర్కొన్నాడు. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు బలంగా ఉంద‌ని, ఈ అంశం వారికి మ‌రింత క‌లిసి వ‌స్తోంద‌ని తెలిపాడు. 
Champions Trophy 2025
Michael Atherton
Nasser Hussain
Team India
Dubai
Cricket
Sports News
Team England

More Telugu News