Anjan Kumar Yadav: రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది: అంజన్ కుమార్ యాదవ్

Anjay Kumar Yadav clarifies on comments on reddy leaders
  • అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • అసత్య ప్రచారం చేసే వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్న మాజీ ఎంపీ
  • పార్టీలోని రెడ్లతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టీకరణ
యాదవ కుల సంఘం సమావేశంలో తాను రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించినట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, వారి మీడియా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. 'తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లు' అని తాను అన్నట్లుగా 'నమస్తే తెలంగాణ'లో ప్రచురించారని మండిపడ్డారు.

తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం చేసే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుల్లోనూ చాలామంది రెడ్లు ఉన్నారని, ఒక సామాజిక వర్గాన్ని దూషించే వ్యక్తిత్వం తనది కాదని ఆయన అన్నారు.

పార్టీలోని రెడ్లతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ అందరి లక్ష్యమని చెప్పారు. కులగణనకు మద్దతుగా మాట్లాడిన తన మాటలను వక్రీకరించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన చేశామని మాజీ ఎంపీ అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టామని తెలిపారు.

కులగణన కార్యక్రమాన్ని స్వాగతించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను యాదవ కుల సంఘం సమావేశంలో కొనియాడినట్లు చెప్పారు. నిన్న జరిగిన యాదవ కుల సంఘం సమావేశంలో అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక సామాజిక వర్గం నేతలు యాదవులను ఎదగనీయకుండా చేస్తున్నారని, పార్టీలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేది లేదని అంజన్ కుమార్ యాదవ్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఆయన ఈరోజు స్పందించారు.
Anjan Kumar Yadav
Congress
Telangana

More Telugu News