CBSC: ఇక సంవత్సరానికి రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు!

cbse draft norms for conducting class 10 board exams twice a year
  • కేంద్ర విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు
  • పదో తరగతి పరీక్షలు ఏడాదిలో రెండు సార్లు నిర్వహించేందుకు సీబీఎస్ఈ ప్రణాళిక
  • ముసాయిదా నిబంధనలతో పబ్లిక్ నోటీస్ విడుదల చేసిన సీబీఎస్ఈ
ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. 2026 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ పబ్లిక్ నోటీసును తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఫిబ్రవరి – మార్చి నెలలలో మొదటి విడత పరీక్షలు, మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ రెండు పరీక్షలు కూడా పూర్తి స్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని ముసాయిదాలో స్పష్టం చేసింది. వీటిపై మార్చి 9లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది.

బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించినా, ప్రాక్టికల్స్/ అంతర్గత మూల్యాంకనం మాత్రం ఒకేసారి చేయనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఈ తరహా విధానం వల్ల విద్యార్థులు తమ పెర్ఫార్మెన్స్ ను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుందని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

దీనిపై ప్రజల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ముసాయిదాను సమీక్షించి, సవరించిన తుది రూపు ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ పరీక్షా విధానంలోనూ ఈ మార్పులు చేపడుతోంది. 
CBSC
Board Exams
10th Class

More Telugu News