Imran Khan: పాకిస్థాన్‌లో క్రికెట్ పూర్తిగా నాశ‌నం అవుతోంది.. ఇమ్రాన్ ఖాన్ విచారం!

Cricket Will Be Destroyed Imran Khans Verdict From Jail After Pakistans Champions Trophy Exit
  • వ‌రుస ఓట‌ముల‌తో ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన ఆతిథ్య పాక్‌
  • త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై జైలులో ఉన్న మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ అసంతృప్తి
  • దేశంలో క్రికెట్ నాశ‌నమ‌వుతోంద‌ని ఆయ‌న‌ విచారం వ్య‌క్తం చేసిన‌ట్లు సోదరి అలీమా ఖాన్ వెల్ల‌డి
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ‌ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో తమ‌ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నారని ఆయన సోదరి అలీమా ఖాన్ తెలిపారు. దేశంలో క్రికెట్ పూర్తిగా నాశ‌నం అవుతుంద‌ని విచారం వ్య‌క్తం చేసిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, ఆతిథ్య జ‌ట్టు వ‌రుస‌గా రెండు ఓట‌ముల‌తో టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. 

కరాచీలో న్యూజిలాండ్‌తో, దుబాయ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల‌లో ఓటమి పాలైన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఆతిథ్య పాకిస్థాన్ నిలిచింది. "భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం పట్ల పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) వ్యవస్థాపకుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు" అని ఇమ్రాన్‌ను కలిసిన తర్వాత అలీమా రావల్పిండిలోని అడియాలా జైలు వెలుపల మీడియాతో అన్నారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ క్రికెట్ ప్రమాణాలను కూడా ఇమ్రాన్‌ ప్రశ్నించారని అలీమా తెలిపారు. "నిర్ణయం తీసుకునే స్థానాల్లో ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించే వారిని ఉంచినప్పుడు క్రికెట్ చివరికి నాశనం అవుతుందని ఇమ్రాన్ అన్నారు" అని అలీమా పేర్కొన్నారు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మధ్య మ్యాచ్‌ను ఇమ్రాన్ వీక్షించార‌ని ఆమె చెప్పారు. కాగా, పాకిస్థాన్‌కు ఇమ్రాన్ ఖాన్‌ 1992 వ‌న్డే ప్రపంచ కప్ టైటిల్ అందించిన విష‌యం తెలిసిందే. 

ఇదిలాఉంటే.. పాకిస్థాన్ క్రికెట్ పతనానికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమని మాజీ పీసీబీ చైర్మన్ నజామ్ సేథి పరోక్షంగా ఆరోపించారు. డిసెంబర్ 2022 నుండి జూన్ 2023 వరకు ఛైర్మ‌న్‌గా పనిచేసిన సేథి ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) లో ఒక పోస్ట్ పెట్టారు. జాతీయ జట్టు ప్రదర్శనపై అభిమానుల‌ ఆగ్రహంలో న్యాయం ఉందన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జ‌ట్టు వరుస పరాజయాలతో టోర్నమెంట్ నుండి నిష్క్రమించ‌డం బాధించింద‌న్నారు. ప్ర‌స్తుతం దేశంలో క్రికెట్ ఆట మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థంగా మారింద‌న్నారు. ప్ర‌స్తుత జ‌ట్టు నుంచి మునుప‌టి గొప్ప‌ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆశించ‌లేమ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  
Imran Khan
Pakistan
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News