MARCOS: ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి మార్కోస్

Navys MARCOS Join Rescue Operation as 8 Workers Remain Trapped
  • సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు
  • నాలుగు రోజులుగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
  • నీరు, బురద కారణంగా విఫలమవుతున్నట్లు వెల్లడి
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. సొరంగంలో నీరు, బురద కారణంగా ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. టన్నెల్ లో సుమారు 12 అడుగుల మేర బురద నీరు పేరుకుపోయిందని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటికే ఎస్ డీఆర్ఎఫ్, ఎన్ డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు పాల్గొంటుండగా, తాజాగా మార్కోస్ ను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కేంద్రాన్ని సాయం అర్థించినట్లు సమాచారం.

ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్) బృందం నింగి, నేల, నీటిలో రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందింది. ఈ బృందాన్ని రంగంలోకి దింపితే కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద బుధవారం నాలుగు ముఖ్యమైన ఆపరేషన్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ లోపలికి వెళ్లేందుకు తోడ్పడే కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతు చేసి పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నారు. టన్నెల్ కూలడంతో ధ్వంసమైన బోరింగ్ మిషన్ ను కట్ చేసి బయటకు తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. సొరంగంలో ఊరుతున్న నీటిని భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. బురదను డీసిల్టింగ్ చేస్తూ ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తామని రెస్క్యూ బృందాల అధికారులు తెలిపారు.
MARCOS
SLBC Tunnel
Workers Trapped
Rescue Operation

More Telugu News