Prashant Kishor: సీఎస్కేని ధోనీ గెలిపించినట్టుగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ని గెలిపిస్తా: ప్రశాంత్ కిశోర్

Prashant Kishor attends Vijay TVK Party first anniversary rally in Mahabalipuram
  • తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్
  • ఇవాళ మహాబలిపురంలో టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవ సభ
  • ఒకే వేదికపై కనిపించిన విజయ్, ప్రశాంత్ కిశోర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట విజయ్ సొంత పార్టీని ప్రకటించాడు. లక్షలాది మంది హాజరైన ఓ భారీ బహిరంగ సభతో తన రాజకీయ ఆగమనాన్ని విజయ్ ఘనంగా చాటాడు. కాగా, వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, విజయ్ తన పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. 

ఇవాళ మహాబలిపురంలో టీవీకే పార్టీ మొదటి వార్షికోత్సవ సభ జరగ్గా... ఈ సభకు ప్రశాంత్ కిశోర్ హాజరుకావడం ఆ వార్తలు నిజమేనని నిర్ధారణ అయింది. ఈ సభలో ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిశోర్ కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ సభలో ప్రశాంత్ కిశోర్ కాకపుట్టించే వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోనీ గెలిపించినట్టుగా... తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ని గెలిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేని గెలిపించి ధోనీ కన్నా పాప్యులర్ అవుతానని వ్యాఖ్యానించారు. 

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ కు ఉన్న ట్రాక్ రికార్డు అందరికీ తెలిసిందే. కాగా, తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ... అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది. డీఎంకే, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విజయ్... అన్నాడీఎంకేపై సానుకూల దృక్పథంతో ఉన్నట్టు తెలుస్తోంది.
Prashant Kishor
Hero Vijay
TVK
Tamil Nadu

More Telugu News