Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం...ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ అవుట్

Afghanistan sent England home from Champions Trophy
  • ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ × ఆఫ్ఘనిస్థాన్
  • 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసిన ఆఫ్ఘన్ టీమ్
  • 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • జో రూట్ సెంచరీ వృథా
  • 5 వికెట్లతో రాణించిన అజ్మతుల్లా ఒమర్జాయ్ 
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు సిసలైన సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత పోరాటంతో ఇంగ్లండ్ ను ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇంగ్లండ్ జట్టును ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటికి పంపింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ రికార్డు సెంచరీ (177)తో అదరగొట్టాడు. అనంతరం 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్లో ఆ జట్టు గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా... కేవలం 4 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ ఆటగాడు జో రూట్ సెంచరీ సాధించాడు. రూట్ 111 బంతుల్లో 120 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జేమీ ఒవెర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లు తీయడం విశేషం. మహ్మద్ నబీ 2, ఫజల్ హక్ ఫరూఖీ 1, రషీద్ ఖాన్ 1, గుల్బదిన్ నాయబ్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బి నుంచి సెమీస్  అవకాశాలు మెరుగుపర్చుకోగా... ఇంగ్లండ్ వరుసగా రెండు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Afghanistan
England
Champions Trophy 2025

More Telugu News