Student Clash: శివరాత్రి రోజు మాంసాహారం.. ఢిల్లీలోని యూనివర్సిటీలో కొట్టుకున్న విద్యార్థులు

Students clash at university in Delhi over non veg food on Maha Shivratri
  • రెండు గ్రూపులుగా విడిపోయిన ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ విద్యార్థులు
  • ఉపవాసం ఉన్న విద్యార్థులకు మాంసాహారం వడ్డించే ప్రయత్నం చేశారని ఏబీవీపీ ఆరోపణ
  • ఏబీవీపీ సభ్యులే తొలుత తమపై దాడిచేశారన్న ఎస్ఎఫ్ఐ
  • గొడవలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి
మహా శివరాత్రి రోజున మాంసాహారం వడ్డించడంతో ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (ఎస్ఏయూ)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. అయితే, ఈ ఘటనపై యూనివర్సిటీ పెదవి విప్పకపోగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే, యూనివర్సిటీలో గొడవపై మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో మైదాన్‌గర్హి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

యూనివర్సిటీలో విద్యార్థులు గొడవ పడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మాంసాహారం వడ్డించడంపై క్యాంటీన్‌లో తొలుత విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరగడం, ఆపై వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ గొడవలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.

మహాశివరాత్రి రోజు మాంసాహారం వడ్డించకూడదన్న తమ ఆదేశాలకు కట్టుబడలేదన్న కారణంతో ఏబీవీపీ విద్యార్థులు తమపై దాడిచేశారని ఎస్ఎఫ్‌ఐ విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీ గూండాలు తమపైనా, మెస్ సిబ్బందిపైనా దాడిచేశారని పేర్కొన్నారు. అంతేకాదు, విద్యార్థినుల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 

అయితే, ఏబీవీపీ వాదన మరోలా ఉంది. ఉపవాసంలో ఉన్న విద్యార్థులకు బలవంతంగా మాంసాహారం వడ్డించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఉపవాసం ఉన్న విద్యార్థులకు మెస్‌లో సాత్వికాహారం వడ్డిస్తుంటే ఎస్ఎఫ్ఐ వారిని అడ్డుకుని బలవంతంగా మాంసాహారం వడ్డంచే ప్రయత్నం చేసిందని ఏబీవీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏబీవీపీ సభ్యులు మహిళల జుట్టు పట్టుకుని దాడిచేశారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ ఢిల్లీ తన ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేసింది. 
Student Clash
Maha Shivratri
South Asian University

More Telugu News