USA: అమెరికాలో కోమాలో కూతురు.. వీసా కోసం భారత్ లో తల్లిదండ్రుల విజ్ఞప్తి

Indian Student In Coma After US Accident Family Seeks Urgent Visa
  • ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత సంతతి విద్యార్థిని
  • రెండు రోజుల తర్వాత తమకు తెలిసిందని చెబుతున్న తల్లిదండ్రులు
  • కూతురు దగ్గరికి వెళ్లేందుకు వీసా కోసం ఎంపీ సుప్రియా సూలేను ఆశ్రయించిన పేరెంట్స్
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన మహారాష్ట్రకు చెందిన నీలం షిండే అనే యువతి అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలో నీలం ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నీలం కాళ్లు, చేతులు విరిగిపోయాయని, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 14న ప్రమాదం జరగగా.. 16న తమకు తెలిసిందని నీలం తల్లిదండ్రులు చెప్పారు. కూతురు వద్దకు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నీలం తండ్రి తానాజీ షిండే వివరించారు. అయితే, ఇప్పటి వరకూ వీసా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాయం చేయాలంటూ ఎంపీ సుప్రియా సూలేను ఆశ్రయించారు.

ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి నీలం షిండే తల్లిదండ్రులకు వీలైనంత త్వరగా వీసా అందించేందుకు సాయపడాలని కోరారు. నీలం షిండే కుటుంబానికి తాము అండగా ఉంటామని సుప్రియా సూలే చెప్పారు. కాగా, సతారా జిల్లాకు చెందిన నీలం షిండే నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుందని, ఇంతలోనే ఇలా జరిగిందని తానాజీ షిండే కన్నీటి పర్యంతమయ్యారు.
USA
Indian Student
Road Accident
California
Indian Parents
USA Visa

More Telugu News