Champions Trophy 2025: వర్షంతో మ్యాచ్ రద్దు... ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో అడుగుపెట్టిన ఆసీస్

Aussies claims semis spot in Champions Trophy after match with Afghanistan called off due to rain
  • ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ × ఆఫ్ఘన్
  • ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్
  • ఇరు జట్లకు చెరో పాయింట్ 
  • మొత్తం 4 పాయింట్లతో సెమీస్ బెర్తు కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. ఇవాళ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య లాహోర్ లో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ టీమ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 1 వికెట్ కు 109 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో ఉన్న వేళ వరుణుడు అడ్డం తగిలాడు. అప్పటికి క్రీజులో ట్రావిస్ హెడ్ 59, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 19 పరుగులతో ఆడుతున్నారు. 

వర్షం వల్ల నిలిచిన మ్యాచ్ మళ్లీ ప్రారంభం కాలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోగా, డీఎల్ఎస్ వర్తింపజేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, ఆఫ్ఘన్ జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మొత్తం 4 పాయింట్లతో ఆసీస్ సెమీస్ లో అడుగుపెట్టింది. 

మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్ కు కూడా సెమీస్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్నాయి. రేపు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 207 పరుగుల భారీ తేడాతో గెలిస్తే... దక్షిణాఫ్రికా రన్ రేట్ ఆఫ్ఘన్ రన్ రేట్ కంటే దిగువకు పడిపోతుంది. అప్పుడు గ్రూప్-బి నుంచి రెండో జట్టుగా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ బెర్తు దక్కించుకుంటుంది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Champions Trophy 2025
Australia
Afghanistan
Semifinal

More Telugu News