Vangalapudi Anitha: స్క్రిప్ట్ ఎవరిచ్చినా... అనుభవించేది 'రాజా'నే: వంగలపూడి అనిత

Posani should face the consequences says Vangalapudi Anitha
  • తనకు స్క్రిప్ట్ సజ్జల ఇచ్చారన్న పోసాని
  • ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదన్న అనిత
  • రెడ్ బుక్ ప్రకారం ముందుకెళితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరిక
వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడిన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను మీడియా ముందు చెప్పేవాడినని పోలీసు విచారణలో పోసాని చెప్పారు. ఈ మేరకు నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకరణపత్రంపై సంతకం చేశారు. 

దీనిపై ఏపీ హోం మంత్రి అనిత మాట్లాడుతూ... స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే అని పోసానిని ఉద్దేశించి అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని చెప్పారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలకు అనిత వార్నింగ్ ఇచ్చారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. తాము కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్పారు. పోసాని మాట్లాడిందంతా వీడియోల్లో ఉందని... చేసిన తప్పుకు ఆయన తప్పించుకోలేరని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళితే వైసీపీ నేతలు ఎవరూ రోడ్లపై తిరగలేరని చెప్పారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. 

వైసీపీ హయాంలో పోలీస్ శాఖలో రూ. 900 కోట్ల బకాయిలు పెట్టారని... అవన్నీ తాము తీరుస్తున్నామని చెప్పారు. కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై అనిత స్పందిస్తూ... కూటమిలో అంతర్యుద్ధం లేదని, వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోవాలని అన్నారు. 

Vangalapudi Anitha
Telugudesam
Posani Krishna Murali
YSRCP

More Telugu News