Sajjala Ramakrishna Reddy: పోసాని కేసులో ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి

Sajjala and his son Bhargav went to AP high court for anticipatory bail
  • వారిద్దరు ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే నడుచుకున్నానని పోసాని వాంగ్మూలం
  • దీని ఆధారంగా సజ్జల, భార్గవరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం
  • తాము అమాయకులమని, ముందస్తు బెయిలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన తండ్రీకొడుకులు
వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిలు కోసం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిలు కోసం వారు పిటిషన్ పెట్టుకున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని.. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. వైసీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను ప్రెస్‌మీట్లలలో, సోషల్ మీడియాలో వారిని బూతులు తిట్టానని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానంటూ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ పెట్టుకున్నారు.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉందని, ముందస్తు బెయిలు ఇవ్వాలని సజ్జల, భార్గవరెడ్డి ఆ పిటిషన్‌లో కోరారు. తాము అమాయకులమని, తమను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పోసాని తమ పేర్లను వాంగ్మూలంలో చెప్పారని, అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లాలో, పులివెందులలో తమకు శాశ్వత నివాసాలు ఉన్నాయని, తప్పించుకుపోయే ప్రశ్నే లేదని, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని అన్నారు. కాబట్టి తమను ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని ఆ పిటిషన్‌లో వారు అభ్యర్థించారు.
Sajjala Ramakrishna Reddy
Sajjala Bhargav Reddy
YSRCP
Posani Krishna Murali

More Telugu News