SLBC Tunnel: సాయంత్రం ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy to Visit SLBC Tunnel 9 Days After Accident
  • రెస్క్యూ పనులను స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం
  • ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నట్లు వెల్లడి
  • చిక్కుకుపోయిన కార్మికులంతా మరణించారని ప్రకటించిన ప్రభుత్వం
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సొరంగంలో కూలిన బురద అడుగున మృతదేహాలను గుర్తించామని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం అధికారికంగా వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే చర్యలు చేపట్టామని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు టన్నెల్ వద్దకు చేరుకుని రెస్క్యూ టీమ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో కలిసి సీఎం టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, టన్నెల్‌ ప్రమాదంలో కార్మికులు చనిపోయారని తెలిసి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ విచారం వ్యక్తం చేశారు. బురదలో చిక్కుకున్న మృతదేహాలను రాడార్ సాయంతో రెస్క్యూ టీమ్ గుర్తించిందని చెప్పారు. వాటిని వెలికి తీసేందుకు తవ్వకాలు చేపట్టారని, సోమవారం మధ్యాహ్నానికి మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు.
SLBC Tunnel
Workers Dead
CM Revanth
Tunnel Visit

More Telugu News