Team India: కివీస్ ను చుట్టేసిన టీమిండియా... సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే...!

Team India will take off Aussies in Champions Trophy semifinal
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు చివరి లీగ్ మ్యాచ్
కివీస్ ను 44 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా 
5 వికెట్లతో న్యూజిలాండ్ ను కకావికలం చేసిన వరుణ్ చక్రవర్తి 
గ్రూప్ లో టాపర్ గా టీమిండియా... సెమీస్ లో ఆస్ట్రేలియాతో ఢీ
మార్చి 4న తొలి సెమీస్ మ్యాచ్
మార్చి 5న రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీలో తన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. తద్వారా గ్రూప్-ఏలో అగ్రస్థానం నిలిచింది. ఇక సెమీఫైనల్లో భారత్... ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 4న దుబాయ్ లో జరగనుంది. 

ఇక, నేడు న్యూజిలాండ్ తో మ్యాచ్ విషయానికొస్తే... మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ తో అలరించాడు. దుబాయ్ లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. ఓ మోస్తరు స్కోరును కాపాడుకోగలదా అని సందేహాలు వ్యక్తమైనప్పటికీ... స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన భారత్... లక్ష్యఛేదనకు దిగిన కివీస్ ను 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ చేసింది. 

వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్  తీశారు. కివీస్ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ విల్ యంగ్ 22, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 28 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ ఫలితంతో సెమీస్ లో ఎవరు ఎవరితో తలపడతారన్నదానిపై స్పష్టత వచ్చింది. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్... గ్రూప్-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్స్ కు అర్హత సాధించాయి. మార్చి 4న దుబాయ్ లో జరిగే తొలి సెమీస్ మ్యాచ్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో... మార్చి 5న లాహోర్ లో జరిగే రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ తో ఆడనుంది. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్ లో భారత్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లోనే జరగనుంది. ఒకవేళ భారత్ సెమీస్ లో ఓడిపోతే ఫైనల్ మ్యాచ్ పాక్ గడ్డపై జరుగుతుంది.
Team India
Semifinal
Australia
New Zealand
Champions Trophy 2025

More Telugu News