DK Shivakumar: డీకేకు సీఎం పోస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ హాట్ కామెంట్స్

No one can stop DK Shivakumar from becoming CM says Veerappa Moily
  • డీకే సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న వీరప్ప మొయిలీ
  • ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని వెల్లడి
  • సీఎం పోస్టు ఎవరో బహుమతిగా ఇస్తే తీసుకునేది కాదని, కష్టపడితే వచ్చేదని వ్యాఖ్య
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ మారబోతున్నారంటూ ఊహగానాలు ఊపందుకోవడంతో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. అయితే, తాను పార్టీకి అత్యంత విధేయుడిననీ, పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేయడం వారి భ్రమ తప్ప మరోటి కాదని చెబుతూ ఆ వార్తలకు డీకే ఫుల్‌స్టాప్ పెట్టారు. 

అంతలోనే ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మెయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. డీకేకు సీఎం పదవి కాలపరిమితితో కూడుకున్నదని, దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, కచ్చితంగా ఆయన సీఎం అవుతారని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందని మెయిలీ పేర్కొన్నారు.  

కేరళలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మెయిలీ మాట్లాడుతూ.. డీకే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ అందుకోవడం వెనక తన పాత్ర కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడాయన విజయవంతమైన నేతగా ఎదిగారని, త్వరలో ఆయన సీఎం కావాలని కోరుకుందామని పేర్కొన్నారు. ఎన్ని ఊహాగానాలు వినిపించినా ఆయన సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు. కాబట్టి సీఎం పదవి విషయంలో ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం పోస్టు అనేది ఎవరో బహుమతిగా ఇచ్చేది కాదని, ఎంతో కష్టపడితేనే వస్తుందని అన్నారు.
DK Shivakumar
Veerappa Moily
Congress
Karnataka

More Telugu News