BJP: రోహిత్ శర్మ లావుగా ఉన్నాడన్న కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

BJP counter to Congress leader comments on Rohit Sharma
  • రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాల్సిన అవసరం ఉందన్న షామా మహ్మద్
  • రాహుల్ గాంధీ 90 ఎన్నికల్లో ఓడినా ఆయన కెప్టెన్సీ ఆకట్టుకుంటోందా? అని చురక
  • డకౌట్ అయిన కాంగ్రెస్ వాళ్లు రోహిత్ శర్మ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు చేసిన మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు షామా మహ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని, ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, ధోనీ, ద్రావిడ్, కోహ్లీలతో పోలిస్తే సాధారణ ఆటగాడని కూడా అన్నారు. రోహిత్ శర్మ ఆకారంపై మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ 90 ఎన్నికల్లో ఓడిపోయినా రాహుల్ గాంధీ కెప్టెన్సీ వారిని ఆకట్టుకుంటోందని, కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం ఆకట్టుకునేలా లేదా? అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎద్దేవా చేశారు. అయినా రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసే మీకు కెప్టెన్సీ విలువ ఏం తెలుస్తుందని చురక అంటించారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడుసార్లు డకౌట్ అయిందని బీజేపీ మరో నేత షెహజాద్ పానావాలా అన్నారు. డకౌట్ అయిన వాళ్లు రోహిత్ శర్మ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలను షామా మహ్మద్ సమర్థించుకున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని, రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేశానని, అది బాడీ షేమింగ్ కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. రోహిత్ శర్మ బరువు ఉన్నాడు కాబట్టే తాను ట్వీట్ చేశానని పేర్కొన్నారు.
BJP
Rohit Sharma
Congress

More Telugu News