Sabitha Indra Reddy: అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy fires at Revanth Reddy government
  • ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శ
  • కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్
  • కాంగ్రెస్ నేతల మాటలు మినహా చేతలు లేవన్న సబితా ఇంద్రారెడ్డి
అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆమె అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి డబ్బులు వస్తాయనే ఆశతో అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారని ఆమె అన్నారు. సకాలంలో చెక్కులు అందజేయకపోవడంతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మారడం లేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ముఖ్యమంత్రికి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ప్రజాపాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. ప్రజల మౌలిక సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతలు మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదన్నారు.
Sabitha Indra Reddy
BRS
Telangana
Congress

More Telugu News