Shreyas Iyer: మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనేందుకు ఒక్కరూ ముందుకు రారు: శ్రేయాస్ అయ్యర్

 No one is going to be there to help you in your tough times says Shreyas Iyer
  • ఏడాదిపాటు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానన్న శ్రేయాస్ అయ్యర్
  • కష్టకాలంలో మన వెంట ఎవరూ రారన్న అయ్యర్
  • జరిగి పోయిన వాటిలో పడి కొట్టుకుపోకుండా వర్తమానంలో జీవించాలని సూచన
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌ను పరాజయం నుంచి గట్టెక్కించిన శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్ గత ఏడాది కాలంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టు జట్టు నుంచి అతడిని పక్కనపెట్టడం, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో తనకు తానే ధైర్యం చెప్పుకున్నానని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. 

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో మళ్లీ వన్డే జట్టులోకి వచ్చిన అయ్యర్ వరుసగా 59, 44, 78, 15, 56 పరుగులు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శ్రేయాస్ ఒకడు. 

తాజాగా, శ్రేయాస్ మాట్లాడుతూ .. కష్ట కాలంలో మనల్ని ఎవరూ ఆదుకోరన్న విషయం తనకు అర్థమైందని, కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేరొకరిపై ఆధారపడటం మాని మనల్ని మనం నమ్ముకుంటే ఫలితం ఉంటుందన్నాడు. ఎవరిపైనా ఆధారపడకుండా ఎలా నడుచుకోవాలో ఆ కష్టకాలం తనకు నేర్పిందన్నాడు. అయితే, కొందరు మాత్రమే మనతో ఉంటారని, వారిని మనం చాలా దగ్గరగా చూసి ఉంటామని పేర్కొన్నాడు. 

 ‘‘ప్రతి సమయంలోనూ నాకు నేనే అండగా నిలిచా. ఆత్మవిశ్వాసం ప్రదర్శించా. ఎల్లప్పుడూ నా వెనుక నేనే ఉన్నా’’ అని అయ్యర్ వివరించాడు. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతానని, గత ఒకటిన్నర సంవత్సర కాలంలో అదే తనకు తోడ్పడిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తానొక టెక్నిక్‌ను అలవరచుకున్నట్టు చెప్పాడు. గతంలో జరిగిన వాటిలో పడి కొట్టుకుపోకుండా వర్తమానంలో జీవించాలని సూచించాడు.
Shreyas Iyer
Team India
Champions Trophy 2025

More Telugu News