Travis Head: ప్రమాదకర హెడ్ ను బోల్తా కొట్టించిన వరుణ్ చక్రవర్తి... ఊపిరి పీల్చుకున్న టీమిండియా

Varun Chakravarty claims Travis Head wicket
 
ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ ట్రావిస్ హెడ్ ఎంతటి ప్రమాదకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ టీమిండియా అవకాశాలను మూసేసింది ట్రావిస్ హెడ్డే. అంతెందుకు... ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ భారత్ పాలిట ప్రతిబంధకంగా మారాడు. దాంతో ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో అతడెలా ఆడతాడోనని భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 

అయితే హెడ్ నేడు భారీ ఇన్నింగ్స్ ఆడకుంటే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అడ్డుకున్నాడు. దుబాయ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా బరిలో దిగిన హెడ్... 39 పరుగుల చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆఫ్ అండ్ మిడిల్ స్టంప్ లైన్ లో వరుణ్ చక్రవర్తి విసిరిన బంతిని భారీ షాట్ ఆడేందుకు యత్నించిన హెడ్... లాంగాఫ్ లో శుభ్ మాన్ గిల్ చేతికి చిక్కాడు. దాంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేశాడు. 

ప్రస్తుతం ఆసీస్ స్కోరు 13 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (23 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్ (3 బ్యాటింగ్) ఆడుతున్నారు. ఓపెనర్ కూపర్ కనోలీ (0) పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. ఈ టికెట్ షమీకి దక్కింది.
Travis Head
Varun Chakravarty
India
Australia
Champions Trophy 2025

More Telugu News