Maha Kumbh Mela: కుంభమేళాలో రూ. 30 కోట్లు సంపాదించిన కుటుంబం!

Yogi Adityanath shares Kumbh Melas success story
  • 45 రోజులపాటు కొనసాగిన మహాకుంభమేళా
  • కుంభమేళాలో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారన్న సమాజ్‌వాదీ పార్టీ
  • పడవ నడిపే వ్యక్తి విజయగాధను పంచుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఓ కుటుంబం ఏకంగా రూ. 30 కోట్లు సంపాదించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కుంభమేళా వల్ల ఎంతోమంది ఆర్థికంగా లాభపడినట్టు చెప్పారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపి రూ. 30 కోట్లు ఆర్జించిందని పేర్కొన్నారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా యోగి మాట్లాడుతూ.. తాను ఒక పడవ నడిపే వ్యక్తి విజయగాధను పంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ కుటుంబానికి 130  పడవలు ఉన్నాయని, ఒక్కో పడవతో రోజుకు గరిష్ఠంగా రూ. 52 వేల వరకు సంపాదించారని తెలిపారు. 45 రోజుల్లో ఒక్కో పడవతో వారు రూ. 23 లక్షల చొప్పున సంపాదించారని పేర్కొన్నారు. మొత్తంగా 130 పడవలతో రూ. 30 కోట్ల వరకు ఆర్జించినట్టు సీఎం వివరించారు.

ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను విజయవంతంగా నిర్విహించామని యోగి తెలిపారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా జరగలేదన్నారు. కుంభమేళా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 7,500 కోట్లు ఖర్చు చేసిందని, దాదాపు రూ. 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. 

హోటల్ పరిశ్రమకు రూ. 40 వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ. 33 వేల కోట్లు, రవాణాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించినట్టు ముఖ్యమంత్రి యోగి తెలిపారు. ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధికి ఈ కుంభమేళా ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. 
Maha Kumbh Mela
Uttar Pradesh
Yogi Adityanath

More Telugu News